kottapalli udayababu

Action Classics Inspirational

4  

kottapalli udayababu

Action Classics Inspirational

రేపటి తరంలోకి...!!! (కథ)

రేపటి తరంలోకి...!!! (కథ)

3 mins
36


రేపటి తరంలోకి...!!! (కథ) 

 ”తాతా.. అమ్మని  నాన్నని  కొట్టే పిల్లలు కూడా ఉంటారా?’’ తాత మనవడు వేదవ్యాస అడిగిన ప్రశ్నకు కంగుతిన్నాడు రఘునాథరావు.

పడకకుర్చీలో కూర్చుని పేపర్ చదువుకుంటున్న ఆయన  దాన్ని మడిచి టీపాయ్ మీద పడేస్తూ తనకు దగ్గరగా వచ్చిన మనవడిని ఆప్యాయంగా గుచ్చిపెట్టుకుని అడిగారు.

’’ అలా అని ఎక్కడ చదివావు?’’

‘’ఇదిగో మా తెలుగు వాచకంలో’’ అని పుస్తకాన్ని అందించాడు వేదవ్యాస. అది ఆరవ తరగతి తెలుగు వాచకం. ఆయనకి  చాలా ఉత్సాహంగా అనిపించింది. 

‘’ఈ పాఠం చదివి నీకు అర్ధమయ్యేలా  చెబుతాను. నువ్వు ఈలోగా ఇంకో హోం వర్క్ చేసుకో నాన్నా.’’ అన్నారాయన ఆరోగ్యంతో మిసమిసలాడే పోతున్న వేదవ్యాస్ బుగ్గ చిదిమి ముద్దు పెట్టుకుని.వేదవ్యాస్ తన పనిలో పడిపోయాడు.

ఆయన చదవడం మొదలు పెట్టారు.  అది గద్యభాగం లో రెండవ పాఠం. పాఠం పేరు ‘’తరాల ప్రవాహం’ అని ఉంది.రచయిత కె. ఆర్. రెడ్డి అని ఉంది.

వెంటనే పేజీ తిప్పి పాఠం మొదటి అక్షరం నుంచి చదవడం  మొదలు పెట్టాడు. కధ  ఆధునిక కాలంలో జరిగినదే. తాము  చదువుకునే రోజుల్లో నన్నయ్య,  తిక్కన, ఎఱ్ఱన,  పోతన మొదలైన కవుల రచనలతో పాటు  ఆధునిక కవులు గురజాడ,  శ్రీశ్రీ,  అడివి బాపిరాజు, దేవులపల్లి  మొదలైన వారు రచించిన పాఠాలు  కూడా ఉండేవి. తన కొడుకు చదువులోకి వచ్చేనాటికి డాక్టర్ సి.నారాయణరెడ్డి, శ్రీమతి మహ్ జబీన్ మొదలైన వారి  రచనలు కూడా  చోటు చేసుకోసాగాయి.  ప్రభుత్వపు ఆ ఆలోచన వల్ల ప్రాచీన సాహిత్యం, ఆధునిక సాహిత్యం రెండూ చదువుతున్నప్పుడు వాటి మధ్య గల పోలికలు,  బేధాలు, మారుతున్న

కాలంతోపాటు సాహిత్యంలో వస్తున్న మార్పులు, స్థితిగతులు అన్ని అవగతమయ్యేవి. వాటిని మరింత విపులంగా చెప్పేవారు తెలుగు ఉపాధ్యాయులు. అందుచేతనే మాతృభాషలో ఏది చదివినా తనకు ఎంతో హాయి అనిపిస్తుంది.

‘’అరె ఇది ఏమిటి? పుస్తకం  ఎదురుగా పెట్టుకుని ఇలా ఆలోచిస్తున్నాను?’’  పక్కదోవ పట్టిన ఆలోచనలను నియంత్రించుకుని ఈసారి పాఠం మీద దృష్టి కేంద్రీకరించిన రఘునాథరావు ముఖం పాఠంలోని విషయం అవగతమౌతున్నకొద్దీ  ఎర్రని కండగడ్డ లా మారిపోయింది. మరో సారి మళ్ళీ చదివారాయన.క్లుప్తంగా ఇదీ కధ.

  ‘’ఒక మధ్యతరగతి కుటుంబంలో భార్య. భర్త,  ఇద్దరు కొడుకులు,  ఒక కూతురు ఉంటారు.  ఇంటి యజమాని బ్యాంకు మేనేజర్ గా పనిచేస్తూ పిల్లల్ని ముగ్గురిని వారు చదువుకున్న చదువులు చదివిస్తాడు. అమ్మాయికి తగిన వరుడిని ఇచ్చి పెళ్లి చేస్తాడు. అబ్బాయిలకు వారి వారి విద్యార్హతలకు  తగిన ఉద్యోగాలు వస్తాయి. తమ తోటి విద్యార్ధులను వారి తల్లి తండ్రులు  అమెరికా పంపి చదివించాలని తాపత్రయపడిపోతుంటే,తమ తండ్రి తమని కేవలం డిగ్రీల చదివించాడన్న వారి కోపాన్ని మరింత పెంచి పోషిస్తారు

కోడళ్ళుగా వచ్చిన వారి భార్యలు.

 వాళ్లని అమెరికా పంపిస్తే తమ అవసానదశలో  వారిని చూసుకొనే అదృష్టం ఉండదేమో అన్న దూరదృష్టితో వారిని వాళ్ళ కాళ్ళ మీద నిలబడేలా  ప్రోత్సహిస్తూనే చదివిస్తాడు తండ్రి. ఒక్కొక్కరు ఇద్దరేసి పిల్లల్ని కంటారు. తమ పిల్లలు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారని చెప్పుకోవాలన్న కోరికతో భార్యలు  రెచ్చగొట్టేసి పంపడంతో  తమకు ఆస్తి పంచి ఇచ్చేయమని వచ్చి తండ్రిని  అడుగుతారు ఆ కొడుకులు .  బ్యాంక్ ఆఫీసర్ ఎన్నో రకాలుగా కొడుకులకు చెప్పిచూస్తాడు. వాళ్ళు వినరు. అడ్డువచ్చిన తల్లిని నిర్దాక్షిణ్యంగా తోసేసి ఆస్తి పత్రాలు దౌర్జన్యంగా తీసుకునే ప్రయత్నం చేయబోతే తండ్రి అడ్డుపడతాడు.   కన్నతండ్రి అని చూడకుండా వారు ఆయనతో కనబడతారు. ఆయన విస్తుపోడు. కుమిలిపోడు.  పిల్లల్ని లాగి కొట్టి  గర్జించి మరోసారి తన గుమ్మం  ఎక్కితే పోలీస్ రిపోర్ట్ ఇస్తానని హెచ్చరిస్తాడు.  అందరిమధ్య జరిగిన ఈ సంఘటనకు  అవమానభారంతో 

కొడుకులిద్దరు  చీదరించబడి, 

చుట్టుపక్కలవారు తల్లితండ్రులకు అండగా నిలబడటంతో వారు  అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఆ సమయంలో వెళ్లి పోతున్న వారిని హెచ్చరిస్తూ తండ్రి ఇలా అంటాడు.

‘’తల్లిదండ్రులు పిల్లలను కనేది  ప్రయోజకులై తమను   పున్నామ నరకం నుంచి తప్పిస్తారన్న నమ్మకంతో.... పిల్లలు ఎవరైనా సరే తమ కంటే  పెద్దవారు అయిన ప్రతి ఒక్కరిని గౌరవించి తీరాలి.  వారి వయసుకు ఖచ్చితంగా విలువ ఇచ్చి తీరాలి. అలా చేయకపోతే రేపటి తరపు మీ పిల్లల  చేతుల్లో మీరు మరింత దారుణంగా

అవమానించబడతారు.

శిక్షించబడతారు కూడా. పెద్దలను గౌరవించడం,  కన్నవారిని వృద్ధాప్యంలో  ఆదుకోవడం,   మరణించాక పితృకర్మలు చేయడం తరతరాల నుంచి వస్తున్న సాంప్రదాయాల ప్రవాహం. ఆ ప్రవాహానికి అడ్డుకట్ట వేసిన వారు చరిత్రహీనులు అవుతారు.  రేపు మీ పిల్లల చేతుల్లో మీరు చరిత్రహీనులుగా మారకుండా చూసుకోండి. ఈ ఆస్తి నా స్వార్జితం. మా ఇద్దరి తదనంతరమే మీకు సంక్రమిస్తుంది. ఒకవేళ మీరు మాకు స్వయంగా  తలకొరివి పెట్టడానికి ఇష్టపడకపోతే ఈ ఆస్తి అంతా ఊరికి చెందుతుంది. అలా వీలునామా రాశాను. వెళ్లి మీ పిల్లల్ని సక్రమంగా పెంచుకోండి. వెళ్ళండి’’

ఆయన సంఘటన  ఊర్లో జనాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది.  దాంతో  ఆ గ్రామంలోని పిల్లలందరూ తరతరాల సాంప్రదాయాలను గౌరవిస్తూనే తమ తమ తల్లిదండ్రుల పట్ల ఎంతో భయభక్తులతో ప్రవర్తిస్తూ ఎందరికో ఆదర్శమవుతారు.

కధ పూర్తయ్యేసరికి   ఆయన  కళ్ళు అశ్రుధారల్ని స్రవించసాగాయి.  ఆ కథ ఎవరిదో కాదు. అక్షరాలా  తమ కధ. ఇంటికి పెద్ద కొడుకుగా తమ్ముడికి  చెప్పాల్సింది పోయి, తాను, తమ్ముడితో చేయి కలిపాడు.   తనకన్నా, తమ్ముడు  తమ తల్లి తండ్రులను మనసుల్లో భయంకరంగా ద్వేషించేవాడు. ఆ  పాపఫలితమేమో...

తిరుమల కొండ లోయల్లో వారు ప్రయాణిస్తున్న  కారు ప్రమాదంలో భార్యా పిల్లలతో సహా మరణించాడు. తన  తప్పు తెలుసుకున్న తాను ఆనాటినుంచి బతికున్న శవంలా  అలాగే బ్రతుకును ఈడుస్తున్నాడు. రేపు తన కొడుకు ఏ క్షణాన్నైనా ఏదో ఒక విషయంలో అభిప్రాయబేధం  వచ్చి తన  మీద చేయి ఎత్తితే... ఇంక తన పెద్దరికానికి గౌరవ ఏముంది?  తండ్రి మీద చేయి చేసుకున్న  పాపం కంటే  ఈ ప్రపంచంలో మరొకటి ఉంటుందా?

 తమ పిల్లలు గొప్ప చదువులు చదివి విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు అని చెప్పుకోవడం కోసం పిల్లలకు కోరిందల్లా  ఇచ్చి,  వారికి కష్టం అంటే ఏమిటో తెలియకుండా పెంచే  తల్లిదండ్రులు అందరికీ ఈ పాఠం చక్కని గుణపాఠం. ఇంతకీ ఈ పాఠం  రాసిన రచయిత ఎవరు?  

వెంటనే ఆయన  పాఠం మొదటిపేజీ తిప్పాడు.  ఆయనపేరు  కందికట్ల రామ్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా వాసి - అంటూ ప్రారంభమైన ఆ కవి కాలాదులు చదివాకా  వెంటనే గుర్తుకు వచ్చాడు అతను.  అతను,  తాను ఆరవ తరగతి నుంచి డిగ్రీ వరకు కలిసి చదువుకున్నారు. వాళ్ళ నాన్నగారు తెలుగుఉపాధ్యాయుడు.  వాడు ఎనిమిదో తరగతి నుంచే పద్యాలు రాసేవాడు. డిగ్రీలోకి  వచ్చేటప్పటికి  గొప్ప రచయితగా పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత తండ్రి అడుగుజాడలలో నడిచి తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు .

అంటే అతను తమ నిజ జీవిత  సంఘటన ఆధారంగా కధ రాసాడన్నమాట.  దానిని రాష్ట్ర ప్రభుత్వం ఒక పాఠ్యాంశంగా నిర్ణయించడం  ఎంత అదృష్టం?

తాను  ఇప్పుడు బెంగళూరులో పెద్ద కొడుకు దగ్గర ఉంటున్నాడు. అతను బెంగళూరు ఎయిర్ ఫోర్స్ సెంటర్లో శిక్షణ కోసం వచ్చేవారికి ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. వాడి కొడుకే వేదవ్యాస. ఆరవ తరగతిలోనే కర్ణాటక ప్రభుత్వం తెలుగు చదువుకునే పిల్లల కోసం తెలుగు వాచకంలో ఒక మంచి కథ పొందుపరిచింది అంటే బాల్య దశనుంచి పిల్లలు ఎలాంటి ప్రవర్తన అలవరచుకోవాలో తెలియచెప్పే ప్రయత్నం ఆ ప్రభుత్వానికి కలిగిన గొప్ప  ఆలోచన.

పిల్లలకు బాల్యంలో మనం ఏది నేర్పిస్తే అదే నేర్చుకుంటారు. తెల్లకాగితం వంటి వారి మనసుల్లో పెద్దలు ఏంచేబితే అవి ముద్రింపబడతాయి. పూవుకు తావిలా చదువుతో పాటు సంస్కారం పరిమళించి ఉత్తమ ప్రవర్తనగా రూపాంతరం చెంది వారిని ఉత్తమ వ్యక్తులుగా తీర్చి దిద్దుతాయి. అవి  తర్వాత తరానికి ప్రవహిస్తాయి. ఈ రకమైన మార్పు మన ఆంధ్ర రాష్ట్రాలలో  ఎప్పుడు వస్తుందో?

 కాలం ఎంత మారినా యువతరం ముందు తరాన్ని గౌరవించాల్సిందే. ప్రేమించవలసిందే.ఆరాధించవలసిందే. 

ఇది తరతరాల ప్రవాహం. ఈ ప్రవాహానికి అడ్డుకట్ట వేయడానికి ప్రవర్తించిన ఎవరికైనా ఆ తర్వాత తరం చేతిలో శిక్ష తప్పదు. అవును శిక్ష తప్పదు! 

అనుకున్నారాయన కన్నీళ్లు తుడుచుకుని.  

‘’తాతా! పాఠం  నాకు అర్థమయ్యేలా చెప్తావా మరి?’’ దగ్గరికి వచ్చిన మనవుడు వేదవ్యాసని తనివారా  కౌగిలించుకుని ‘’నీ వల్ల నాలాంటి  మరో రెండు తరాలవారు

ఆనందంగా బ్రతకాలి  నాన్నా.’’ అనుకుని  సంతోషాతిరేకంతో

పాఠం చెప్పడానికి ఉద్యుక్తుడయ్యాడు రఘునాధరావు!!!                 

సమాప్తం

 

 

 


Rate this content
Log in

Similar telugu story from Action